Input your search keywords and press Enter.

మూడవ భాగం : న్యాయ మెక్కడ , మహాప్రభో?

చాలా నిశబ్దంగా తెలంగాణలో గిరిజనులమీద , దళితుల ఉనికి మీద ప్రభుత్వం దాడిచేస్తూ ఉంది.

తెలంగాణ ప్రభుత్వం పాత అదిలాబాద్ జిల్లాలో గిరిజనుల, దళితుల భూములను లాక్కుంటూ ఉందో ‘ది లీడ్’ (The Lede) వాళ్ల మధ్య నిలబడి వెలికితీసింది. ఇది మూడు భాగాలుగా ప్రజలముందుకొస్తుంది.

మీరీ దారుణంగా, రాష్ట్ర ప్రభుత్వం అటవీ శాఖ, పోలీసులు, రెవిన్యూ అధికారుల రూపంలో పేద గిరిజనుల మీద దళితుల మీద దాడులు జరిపి, దశాబ్దాలుగా వాళ్లు సాగుచేసుకుంటూ ఉన్న భూములను లాక్కుంటూ ఉంది.

ప్రభుత్వమే వీళ్లలో కొందరికి పట్టాదార్ పాస్ పుస్తకాలను, అటవీ హక్కు ప్రతాలను ఇచ్చిందన్న వాస్తవాన్ని కూడా తెలంగాణ ఏలినవారు ఏమాత్రం పట్టించుకోవడం లేదు.

‘లక్ష్యాలు’ పూర్తి చేయడమే తమ పని అని అటవీ అధికారులు చెప్పడం ‘ది లీడ్’ గమనించింది. ప్రభుత్వం నిర్దేశించిన అంకెల లక్ష్యాల (targets)ను పూర్తి చేసేందుకు పేద దళితుల, గరిజనుల బతుకులేమయినా పర్వాలేదనే బాధాకరమయిన నిర్లక్ష్యం జిల్లా అధికారులలో కనిపిస్తుంది.

సాధారణంగా ప్రభుత్వ అణచివేత, హింస, మానవ హక్కుల, భూ హక్కుల ఉల్లంఘన జరిగి, గుర్తుపట్టలేనంతగా సర్వం కోల్నోయినపుడే ఈ దరిద్రులు మన కళ్లకు కనిపించేది.

కొమరం భీమ్ జిల్లాలో కనిపిస్తున్నది విచ్చలవిడిగా సాగుతున్న ప్రభుత్వ అణచివేత, హింస, మానవ హక్కుల ఉల్లంఘన వికృత రూపం. ఇది ఇంకా హింసాత్మకంగా మారకముందే నివారించవచ్చు.

భారతదేశంలో రైతులకు భూమి కంటే బలమయిన మరొక భావోద్వేగ సొత్తు కనిపించదు. మరొక ఆదరువు లేని వాడి నుంచి ఆ కొద్ది భూమినీ లాక్కున్నపుడు ఆగ్రహం అంటుకుంటుంది. ఈ ప్రాంతాలల పర్యటించినపుడు ‘ది లీడ్’ కళ్లారా చూసిందిదే.

ఎందుకిదంతా జరుగుతూ ఉంది? ముఖ్యమంత్రికి ప్రతిష్టాకరమయిన కాళేశ్వరం ప్రాజక్టులో మునిగిపోయిన భూములకు నష్టపరిహారంగా మొక్కలు నాటాలి. అంటే ఒకచోట చెట్లు నరికేసి మరొక చోట మొక్కలు నాటడం.

ఈ మూడు భాగాల కథనంలో తొలివిడత ది లీడ్ మిమ్మల్ని సర్సాల గ్రామానికి తీసుకువెళ్తుంది. ఇక్కడేం జరిగిందో కూడా గుర్తుపట్ట లేనంతా నిజాన్ని అధికార బలాఢ్యులు పూర్తిగా రూపుమాపారు.

ఈ చివరి మూడో భాగంలో రాష్ట్ర ప్రభుత్వం దాడి తర్వాత గిరిజనుల కోర్టుల ఉదాసీనతను ఎదుర్కొంటున్న విషయాన్ని ది లీడ్ మీ ముందుంచుతున్నది.

ఒక వైపు ప్రభుత్వం దాడులు, మరొక వైపు కోర్టుల ఉదాసీనత

కాగజ్ నగర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సి అనిత, మరికొందరు అటవీ సిబ్బందిని వెంటేసుకుని జూన్ 30న పోలీసులతో కలసి సర్సాల గ్రామస్థుల మీద ఎలా దాడి చేశారో ది లీడ్ ఇంతకు ముందు వివరించింది.

గ్రామస్థులు వాళ్ల మీద ఎదురుదాడి చేశారు. అనిత మీద దాడి చేసి కొట్టారు.అయితే,ఇదే విపరీతంగా ప్రచారమయి అందరి మెదళ్లలో ఒక అఘాయిత్యం లాగా నాటుకు పోయింది.

అటవీ సిబ్బంది చేసిన దాడి, ఫారెస్టాఫీసర్ ఒక గర్భిణీని కొట్టడం, ఆమెకు అబార్షన్ కావడం వగైరా సంఘటనలు వెలుగులోకి రాలేదు.

ఈ నేపథ్యంలో ది లీడ్ ఈ జిల్లాలో విస్తృతంగా పర్యటించింది. సర్సాలకే కాదు, ఇలా అటవీ శాఖ వారి దురాగతాలు జరుగుతున్న ఇతర గ్రామాలలో కూడా ది లీడ్ పర్యటించింది. చట్టమంటే గౌరవం లేకపోవడం వల్ల అన్ని చోట్ల వాళ్ల దాడులు హింసాత్మకంగా మారాయి.

జిల్లాలో అనేక చోట్ల గిరిజనుల, దళితుల భూములను అటవీ శాఖ వారు లాక్కున్నారు. ఈ ఆగ్రహం ప్రజల్లో స్పష్టంగా కనిస్తుంది.

ఇక్కడ ప్రభుత్వమే అన్యాయంగా దాడులు చేయిస్తూ నేరానికి పాల్పడుతూ ఉండటంతో న్యాయం జరుగుతుందన్న ఆశతో గిరిజనులు కోర్టుల వైపు పరుగుతీస్తున్నారు.

అయితే, కోర్టులూ వాళ్ల సమస్యల పట్ల ఉదాశీనంగా ఉన్నట్లు కనిపిస్తుంది. షెడ్యూల్డ్ తెగల హక్కులను కాపాడేందుకు తెచ్చిన 2006 ఫారెస్టు హక్కుల చట్టాన్ని కోర్టులు పెద్దగా పట్టించుకున్నంటున్నట్లు కనిపించవు.

మొదట, సుప్రీంకోర్టు

సర్సాల హింస తర్వాత గిరిజన బాధితులు ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ అనిత మీద షెడ్యూల్డ్ కులాల, తెగల చట్టం కింద కేసు పెట్టారు.

ఈస్గావ్ డిఎస్ పి ఈ కేసులో ఎఫ్ ఐ ఆర్ కూడా దాఖలు చేశారు.అయితే, మరుసటి రోజే ఎడిఎన్ రావు అనే అడ్వకేట్ ఇంటర్ లాక్యుటరీ పిటిషన్ వేశారు. రావు అటవీ సంబంధమమయిన కేసులలో సుప్రీంకోర్టుకు అమికస్ క్యూరియే గా వ్యవహరిస్తూ ఉంటారు. ఆయన టైమ్సాఫ్ ఇండియా, హిందూస్థాన్ టైమ్స్ లో వచ్చిన కథనాలను కోర్టు దృష్టికి తీసుకువచ్చి, తెలంగాణాలో అటవీ శాఖ అధికారులు జీవితాలకు ప్రమాదం ఏర్పడిందని, 29.06.2019 న ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ మీద జరిగిన దాడి మీద తెలంగాణ ప్రభుత్వం నుంచి నివేదిక కోరాలని ఆయన కోర్టుకు సూచించారు. దీనితో జూలై 19న అనిత మీద ఎస్ సి , ఎస్ టి చట్టప్రకారం చర్యలు తీసుకోకుండా సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది.

అంతేకాదు, మహిళా అటవీ శాఖ అధికారులు కోరినపుడు వారికి పోలీసు రక్షణ కల్పించాలని, మహారాష్ట్ర, తెలంగాణాలో మహిళా ఫారెస్టు అధికారులు కోరిన వెంటనే ఆయన జిల్లాల పోలీసు సూపరిండెంటెంట్లు తగిన భద్రత కల్పించాలని కోర్టు ఆదేశించింది.

ఇలాంటి దాడుల నుంచి మహిళా అధికారులను ఎలా కాపాడతారో ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు చెప్పాలని, అదే విధంగా ఇంతవరకు తీసుకున్న చర్యలేమిటో, ఈ ఉత్తర్వులను ఎలా అమలుచేస్తారో కూడా నివేదిక సమర్పించాలని కోర్టు ఆదేశించింది.

ఈ సమయంలో సర్సాల లేదా ఇతర గ్రామాలలో ఫారెస్ట్ అధికారుల దౌష్ట్యానికి గురై భూములు పోగొట్టు కున్న వారితరఫున మాట్లాడే వారెవరూ కోర్టులో లేరు.

తమకు జరిగిన అన్యాయాన్ని జాతీయ ఎస్ టి కమిషన్ కు, మానవ హక్కుల కమిషన్ కు తెలియ చేసేందుకు సర్సాల బాధితులకు కొంతమంది న్యాయవాదులు సహకరించారు.

‘‘మాకు జీవనాధారమయిన భూములను, పంటలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ దాడులను ఆపాలని ఫారెస్టాఫీసర్ అనితను కాళ్లా వేళ్లా పడి వేడుకున్నాం,’ అని సరసాల కు చెందిన నైని భూదేవి అనే మహిళ తాను కమిషన్లుకు పంపిన వినతిపత్రంలో పేర్కొంది.

‘‘ ఈ భూములకు సంబంధించి మాదగ్గిర ఉన్న పత్రాలను ఈ భూములు మా సొంతమని ఆమెను వప్పించేందుకు చాలా ప్రయత్నించాం. అయితే, ఆ ఫారెస్టధికారి మా గోడు వినడానికి బదులు దుర్భాష లాడటం మొదలుపెట్టింది. మమ్మల్ని ‘మన్యం లంజముండల్లారా’ అని తిట్టింది. ఈ భూమి మీ అబ్బజాగీరనుకున్నారా,మీ కులం వ్యవసాయానికి పనికిరాదు, ఏదో కూలోనాలో చేసుకుని బతుకు పోండి,’’అని కూడా ఆమె తిట్టినట్లు వినతిపత్రంలో పేర్కొన్నారు.

జాతీయ ఎస్ టి కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్లలో మరొకరు ఆరుగురు మహిళలు కూడా పిటిషన్లు వేశారు.

జాతీయ మానవహక్కుల కమిషన్ నుంచి ఒక మెుక్కుబడి సమాధానం వచ్చింది. అదేమిటంటే ‘‘ ఈ ఫిర్యాదుమీద చర్యలు తీసుకునే నిమిత్తం సంబంధిత అధికారికి పంపండి. ఆ అధికారి దీని మీద చర్యలు తీసుకున్నాక దాని గురించి బాధితులకు తెలియ చేయాలి,’’ అని ఆదేశించారు.

జాతీయ మానవహక్కుల కమిషన్ ఏ అధికారికి ఈ ఉత్తర్వు పంపిందో, ఎలాంటి చర్య తీసుకోవాలని చెప్పిందో వివరాలు లేవు.

జాతీయ ఎస్ టి కమిషన్ ఇంకా స్పందించలేదు.

తర్వాత, హైకోర్టు

సర్సాలలో దాడి జరగడం, గిరిజనుల భూములను అటవీశాఖ వారు లాక్కోవడం జరిగిందని తెలియగానే ఇతర గ్రామాల ప్రజలు జూలై 9న తమ భూములను కాపాడుకునేందు సాయం చేయాలని న్యాయవాదులను సంప్రదించారు.

తెలంగాణ హైకోర్టులో రెండు పిటిషన్లు వేశారు. ఇందులో ఒకటి రేగులగూడ, ఉత్పల్లి, పోచమ్మగూడ, చారిగ్రాం,వాడిగూడలలోని 79 మంది గిరిజనలు వేసిందయితే రెండో పిటిషన్ ని అంకుశాపూర్, వంజిరి గ్రామాలకు చెందిన 67 మంది గిరిజనులు వేశారు.

తమకు ఉన్న పట్టాలను చూపిస్తూ ఈ భూముల్లో ఇప్పటికే వరి, పత్తి వంటి పంటలు వేసుకున్నామని వారు కోర్టు కు తెలిపారు. అయితే, గత కొద్ది రోజులుగా ఫారెస్ట్ అధికారులు తమ వూర్లకు వచ్చి పొలాల్లోకి వెళ్ల కుండా, అక్కడ వ్యవసాయ పనులు చేయకుండా అడ్డుకుంటున్నారని పిటిషనర్లు కోర్టుకు నివేదించారు.

కొన్ని గ్రామాలలో ఫారెస్టు అధికారులు రైతులు పొలాల్లోకి రాకుండా అడ్డుకునేందుకు నాగళ్లును, అద్దెకు తెచ్చుకున్న ట్రాక్టర్లు ఎత్తుకుపోయారని కూడా వారు కోర్టుకు తెలిపారు.

చివరకు అతికష్టం మీద తాము భూమిని చేతులతో దున్ని పత్తి విత్తనాలు వేయాల్సి వచ్చిందని వారు పిటిషన్లో పేర్కొన్నారు. కొమరం భీమ్ జిల్లాలో ఫారెస్టు అధికారులు పెద్ద ఎత్తున పోలీసులను వెంటబెట్టుకుని పట్టాలున్నతమ భూముల్లోకి చొరబడి పంటలను ధ్వంసం చేసి భూములు లాక్కుని అక్కడ మొక్కలు నాటుతున్నారని వారు చెప్పారు.

తమ గ్రామాల్లో కూడా ఇలాగే దాడి చేసే అవకాశముందని తాము భయపడుతున్నామని వారు కోర్టు కు సమర్పించిన పిటిషన్ లో పేర్కొన్ని న్యాయం చేయాలని కోరారు.

రెండు వర్గాల పిటిషన్ లను పరిశీలించి హైకోర్టు జూలై 11న పిటిషనర్లకు వ్యతిరేకంగా ఉత్తర్వులిచ్చింది.

అటవీ భూములను చాలా మంది ఆక్రమించుకుంటున్నారని, దీనిని నివారించేందుకు అటవీ శాఖ అధికారులు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నారని, అవసరమయిన చోట ఫారెస్టు భూములును ఆక్రమించుకున్నవారికి తగిన వసతులు కల్పిస్తున్నారని ప్రభుత్వ న్యాయవాది చెప్పిన దానితో కోర్టు సంతృప్తి చెందింది.

పిటిషనర్ల ఆందోళనకు అర్థం లేదని, అది చెల్లదని కోర్టు తీర్పు ఇచ్చింది.

అయితే, గిరిజనులను సతాయించకుండా ఫారెస్టు అధికారులు చట్ట ప్రకారమే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

సర్సాలతోపాటు అనేక ఇతర గ్రామాలలో పట్టాపాస్ పుస్తకాలున్నా, హక్కు ప్రతాలున్నా అటవీ అధికారులు భూములను లాక్కున్నారని గిరిజనులు చెబుతున్న వివరాల్లోకి కోర్టు వెళ్ల లేదు.

అదే విధంగా ఫారెస్టు అధికారులు చట్టాలను ఉల్లంఘించి గిరిజనులు మీద సాగించిన హింసా కాండ గురించి పిటిషన్ లో పేర్కొన్న విషయాలగురించి కూడా కోర్టు విచారించలేదు.

సరిగదా, ఇదేదో భూమి యాజమాన్యం గొడవ, ఇదేమంత పెద్ద విషయం కాదన్నట్లు కోర్టు వ్యవహరించింది. నిజానికి దేశంలో ఒక బలహీన వర్గానికి చెందిన భూమి అని, అది జీవానాధారానికి సంబంధించిన తీవ్రమయిన విషయంగా పరిగణంచాల్సిఉండింది.

గిరిజనులకు, గిరిజనేతలకు బతుకు దెరువు హక్కుల విషయంలో తేడా ఉంటుందని చెప్పే 2006 ఫారెస్ట్ హక్కుల చట్టం గురించి కోర్టు ఆలోచించనేలేదు.

గిరిజనుల తరిమివేత

తెలంగాణలో వాంకిడి అనేది చిన్న పట్టణం. మహారాష్ట్ర సరిహద్దున ఉంటుందీవూరు. ఇక్కడ ఉన్న పాడుబడిన ప్రభుత్వ పాఠశాల భవనంలో గోండు గిరిజన తెగకు చెందిన 16 కుటుంబాలు తలదాచుకుంటున్నాయి.

ఈస్కూల్ భవనాలు శిధిలావస్థలో ఉన్నాయి. పైకప్పు పెచ్చులూడుతూ ఉంది.

వాన కురిస్తే జానెడు పొడి జాగా లేకుండా తరగతి గదులన్నీ జలమయం అవుతాయి.

వీళ్లకొక డజన్ మేకలున్నాయ్. అవి కాంపౌండంతా తిరుగుతూ అరుస్తూ కనిపిస్తాయ్.

వీళ్లకి ఐటిడిఎ వాళ్ల కొద్దిగా బియ్యం, కందిపప్పు, కూరగాయలు ఇచ్చారు. ఇది వాళ్లు రోజూ తినే ఆహారం కాదు.

జూన్ నుంచి ఈ వాంకిడి హాస్టల్ లో మూలన కూర్చుని ఏంచేస్తున్నారు వీళ్లంతా.

మళ్లీ కథ తెలంగాణ అటవీ శాఖ అధికారుల దగ్గిరకే వెళ్తుంది.

‘‘ఒక రోజు పొద్దునే పత్తి విత్తనాలు వేస్తున్నపుడు అటవీ శాఖ అధికారుల వచ్చి, పొలాల్లో ఉన్న మా గుడిసెలును ట్రాక్టర్లు, ప్రొక్లెయిన్స్ ఉపయోగించి పెరికేశారు,’ అని సిడాం భీమ్ బాయ్ (50) చెప్పింది. ఇక్కడి సమీపంలోని కొలామ్ గూడెంలో భీమ్ బాయ్ ఎనిమిది ఎకరాల్లో పోడు వ్యవసాయం చేసుకుంటూ ఉంటుంది.

” మా ఇళ్లను ఎందుకిలా కూల్చేస్తున్నారని అడిగితే ఫారెస్టు అధికారలు మమ్మల్నితన్ని పట్టుకుని ఎత్తి జీపులో పడేశారు,’ అని సిడాం పావు (70) చెప్పాడు. ఆయనకు అయిదెకరాల పోడు భూమి ఉంది.

” మా దేవత ముతాల తల్లి ఇంకా మాయింట్లో ఉంది. మా పశువులు, ఇతర సామాన్లు అన్నీ అక్కడే ఉన్నాయ్. ఇక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోవాలనుకుంటున్నాం,’ అని భీమ్ బాయ్ వాపోతుంది.

ఈ భూములకు హక్కులు కల్పిస్తూ ప్రభుత్వం ఇచ్చిన హక్కు ప్రతాలున్నాయి. వాటిని ది లీడ్ కు చూపించారు కూడా.

‘‘ అనితా మేడమ్ మమ్మల్నంతా బలవంతగా జీపులోకి తోసేసేంది. మా భూముల్లో వాళ్ల మొక్కలు నాటుతారంట. మేం అడవులు నరికేశామని చెబుతున్నారు. మేము అలాంటి పని చేయనే లేదు. ఈ భూమి మా రక్తం. ఈ జాగాలో 50 సంవత్సాలుంచి బతుకుతున్నాం,’ అని భీమ్ బాయ్ వివరంగా చెప్పింది.

కోవా భీము (50) అయిదెకరాలు పోడు వ్యవసాయం చేసుకునే వాడు.ఇపుడాయన అప్ సెట్ అయి ఉన్నాడు. ‘‘ వాళ్లంతా పన్నెండు జీపులలో, అయిదు ట్రాక్టర్ల్లలో, ఒక బుల్డోజర్ తో మా గూడెల మీద దాడి చేశారు. అక్కడేంజరగుతుందో మాకెరికే లేదు. మమ్మల్ని అక్కడి నుంచి జీపుల్లో కాగజ్ నగర్ టింబర్ డిపోకు తీసుకువెళ్లారు. తలదాచుకునేందకు అక్కడేమీలేదు,’’ అని ఆయన చెప్పాడు.

పక్కనే ఉన్న మరొక స్కూల్లో ఆత్రమ్ మధుబాయ్ (25) ఉంటుంది. ది లీడ్ వెళ్లే సరికి ఆమె చిన్న బాబుని వూయల వూపుతూ మరొక పక్క ఒక పాత జీన్స్ ప్యాంట్ ను కుడుతూ ఉంది. ‘‘ నేను పుట్టిందే ఈ అడవిలో. కోలామ్ గూడెం కు 10 సంవత్సరాల కిందట వచ్చాం. కోర్టేమే మీ భూములు మీకు వస్తాయని చెప్పింది. ఇంకా రాలేదు,’’ అని ఆమె తన కష్టాల గురించి చెప్పింది.

గోండుకుటుంబాల న్యాయపోరాటం నాటకీయంగా ఉంది.

ఇక్కడ 16 గోండు కుటుంబాలను వాళ్ల భూముల నుంచి తరిమేస్తున్నారని ఒక గిరిజన సంస్థకు తెలిసింది. వాళ్లు వెంటనే న్యాయవాదులను సంప్రదించి 67 మందితో హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేయించారు.

జూన్ 15న జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, జస్టిస్ షమీమ్ అక్తర్ ల ధర్మాసనంఈ కుటుంబాల పెద్దలను కోర్టు ముందు హాజరుపర్చాలని అటవీ శాఖ వారిని ఆమోదించారు.

తెలంగాణ టూరిజం డెవెలప్ మెంటు వారి బస్సులో సిడం పావు, కోవాభీమ్ లను తీసుకు వచ్చి కోర్టు ముందు హాజరుపర్చారు.

అంతే కాదు, గోండ్ భాష సమస్య వస్తుంది కాబట్టి తమకు సహకరించేందుకు సిద్ధంగా ఉండాలని కోర్టు ఇద్దరు ఉస్మానియా యూనివర్శిటీ ప్రొఫెసర్లును కోరింది.

ఈ కోలామ్ గూడెంలోని గోండులందరికి మూడు సార్లు ఖాళీ చేయమని నోటీసులు ఇచ్చామని, అందుకే వాళ్లంతా స్వచ్ఛందగా గూడెం ఖాలీచేసి పెట్టెబేడె సర్దు కుని వెళ్లిపోయారని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు.

కోర్టు దీని మీద జూన్ 15న తాత్కాలిక ఉత్తర్వులిచ్చింది.

‘‘ ప్రభుత్వమేమో సిడమ్ పావు,మరొక ఆరుగురు ఫారెస్టు భూములు ఆక్రమించుకున్నారని చెబుతున్నది. పిటిషన్లో ఉన్న 67 మంది 16 కుటుంబాలకు చెందిన వాళ్లు. వాళ్లంతా ఒక డిపోలో ఉన్నారు. మిగతా తొమ్మిది కుటుంబాలకు కూడా ఎవిక్షన్ నోటీసులిచ్చారా లేదా అనేది స్పష్టంగా లేదు. ఈ తొమ్మది కుటుంబాలు ఇళ్లు పొయ్యి స్వచ్ఛందంగా వదిలేసి డిపోలో తలదాచుకుంటున్నారా? ఇది కూడా క్లియర్ గా లేదు. అందువల్ల ప్రభుత్వ న్యాయవాది చెబుతున్న కథ నమ్మదగ్గదిగా లేదు,’ అని కోర్టు వ్యాఖ్యానించింది.

జూన్ 16 న సిడం పావు, ఇతర కుటుంబాల పెద్దలు కోర్టు ముందు నేరుగా వాంగ్మూలం ఇచ్చారు.

కోర్టు ఇచ్చిన చివరి ఉతర్వులో 2006 ఫారెస్టు హక్కుల చట్టం వూసే లేకుండా విడుదలయింది.

కోర్టు ఏమి చెప్పిందంటే… ‘‘ఈ గోండు కుటుంబాలు కోలాం గూడెంలో గత 50 సంవత్సరాలుగా నివసిస్తున్నాయ్. వీళ్లకి తెలుగు రాదు. వాళ్లు విశేషమమయిన తమ భాషలోనే మాట్లాడారు.’’

‘‘ మా కుటుంబం తో పాటు ఇతర కుటుంబాలు 50 సంవత్సరాలుగా ఫారెస్టు భూములను దున్నుకుంటున్నాయ్. గతంలో తమకు నోటీసులు ఇచ్చినా, అవి తెలుగులో ఉండటం వల్ల, తమకు తెలుగు తెలియకపోవడం వల్ల అందులో ఏమిరాసిందో మాకు అర్థం కాలేదని సిడమ్ పావు చెప్పాడు. దానికితోడు 12.06.2019 కి ముందు వాళ్లకి భూమి హక్కు ఉందని, దానికి తగిన పరిహారం వస్తుందని చెప్పి నోటీసుల మీద సంతకాలు తీసుకున్నారు. దీనితో వాళ్లు కొన్ని పత్రాల మీద సంతకాలు చేశారు. అందులో ఏమి రాసి ఉందో వాళ్లకి తెలియదు.,’ అని కోర్టు ఉత్తర్వులో ఉంది.

కోర్టు 2006 ఫారెస్టు హక్కుల చట్టంలో పొందుపరిచిన ఒక కీలకమయిన అంశాన్ని ఇక్కడ ప్రస్తావించింది. గిరిజనులనేవాళ్లు అడవిలో భాగమని, వారిని అడవినుంచి విడదీయలేమని కోర్టు స్పష్టంగా పేర్కొంది.

‘‘ గిరిజనుల్లో ఎక్కువ మంది అడవుల్లో జీవిస్తున్నారనేదాంట్లో అనుమానమేమీ లేదు. శతాబ్దాలుగా కాకపోయినా వాళ్లు, వాళ్ల పూర్వీకులు దశాబ్దాలుగా ఇక్కడే ఉంటున్నారు. ఈ గిరిజనుల పునాదులు దట్టమయిన అడవుల్లో, కోండల్లో, నదుల్లో ఉన్నాయి. అందువల్ల వాళ్ల భౌతికంగా , మానసికంగా భూమిలో లీనమయినపోయారు.వాళ్ల జీవితం, విశ్వాసాలు వాళ్ల పరిసరాలనుంచే వస్తాయి. వాళ్ల జీవితం అడవి చుట్టు, అక్కడి జంతువుల చుట్టు, పరిసరాల చుట్టూ తిరుగుతూ ఉంటుంది,’ అని కోర్టు చక్కగా పేర్కొంది.

ఇంత చెప్పాక కోర్టు తీర్పును దానికి తగ్గట్టుగా ముగించాల్సి ఉండింది. ఈ 16 కుటుంబాలకే కాదు, తెలంగాణ అంతటా, భారతదేశమంతా గిరిజనులకు జరిగిన అన్యాయాన్ని సరిచేసేందుకు కోర్టుకు మంచి అవకాశం లభించింది. దానిని వినియోగించుకుని ఉండాల్సింది.

ఇద్దరు సభ్యుల ధర్మాసనం చివరి ఉత్తర్వులో పై వ్యాఖ్యల్లో కనిపించిన లోతైన అవగాహన కనిపించదు. అటవీ శాఖ ఈ కుటుంబాలన్నింటికి వాంకిడిలో బస ఏర్పాటుచేయాలని అరునెలలలో వారికి ప్రత్యామ్నాయం భూమి, ఇళ్లు, రోడ్ల వసతి కల్పించాలని కోర్టు ఆదేశించింది.

కాకపోతే, ఈ ఆరునెలల కాలంలో వాళ్లకి రాష్ట్ర ప్రభుత్వమే ఆహారం, వైద్యం, చదువు,ఇతర కుటుంబావసరాలు తీర్చాలని ,వారికి కొత్త వృత్తుల్లో శిక్షణ ఇవ్వాలని సూచించింది. వాళ్లకి పశువులను కూడా తిరిగి ఇవ్వాలని కోర్టు చెప్పింది.

అయితే, తామిక్కడ ఉండలేమని, తమ గూడేనికి పంపాలని కోవా మెంగుబాయ్ చిన్న పిల్లలాగా రోధిస్తుంది. ‘మేమెక్కడా బతక లేం. మా భూమి మాకు తిరిగివ్వండి,’ అని ఆమె ప్రాధేయపడుతుంది.

వాళ్లంతా అటవీ ఆక్రమణ దారులు: అటవీ శాఖ

ఈ గిరిజనులంతా 2013లోనే ఈ ప్రాంతాలకు వచ్చారని, 50 యేండ్లుగా ఇక్కడే జీవిస్తున్నామని వారు చెబుతున్నది అబద్దమని, ఈ పదహారు కుటుంబాలను తరలించడానికి కూడా నాయకత్వం వహించిన ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ అనిత ది లీడ్ కు చెప్పారు.

‘‘ వాళ్లంతా వాంకిడి మండలంలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన వాళ్లు. సిడాం పావు ఇతర బంధువులందరిని వెంటేసుకుని వచ్చాడు. వాళ్లంతా మూడు గూడేలలో ఉంటున్నారు,’ అని అనిత చెప్పారు.

ఈ గిరిజనులు 40-50 ఎకరాల భూమిని ఆక్రమించుకున్నారని ఆమె ఆరోపిస్తారు.

‘‘ గూడెలను ఖాళీ చేయాలని మూడు నోటీసు లిచ్చాం. అయినా ఖాళీ చేయలేదు. అందుకే వాళ్లని అక్కడి నుంచి తరిమేయాలనుకున్నాం. వాళ్లంతా ఈ ప్రాంతానికి 2013లోనే వచ్చారని చెప్పేందుకు మాదగ్గిర ఉపగ్రహ ఫోటోలున్నాయి.’’అని కూడా ఆమె చెప్పారు.

అడవుల్లో ఉండే గిరిజనులు తెలుగులో వచ్చిన నోటీసులను ఎలా అర్థంచేసుకుంటారు, ఎలా స్పందిస్తారు?

అంతులేని హింస

గిరిజనుల భూములను లాక్కోవడంలో, వాళ్లని గూడెల నుంచి తరిమేయడంలో, వాళ్లు పశువులను మేపుకోనియకుండ అడ్డుకోవడంలో, పుల్లలేరుకోవడంలో తెలంగాణ అటవీ శాఖ గిరిజనులతో తగవుపెట్టుకున్నట్లే అనిపిస్తుంది.

అడవీ అధికారులు తమ కడుపులు కొట్టారనే భావం సర్సాల, మార్తండి, సిరిషా, డబ్బా, వాంకిడిలలోని గిరిజనులో బలంగా ఉంది. ఈ విషయాన్నే వారు ది లీడ్ కు చెప్పారు. ప్రభుత్వమే కక్ష కట్టినపుడు, కోర్టులు ఉదాసీనంగా ఉన్నపుడు గిరిజనులకు దిక్కెవరు?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *