కార్పొరేట్ సంస్థలు రాజకీయ పార్టీలకు రహస్యంగా విరాళాలు ఇవ్వటానికి తలుపులు బార్లా తెరవటం అనే తమ ప్రభుత్వ నిర్ణయాన్ని నాటి కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ 2017 ఫిబ్రవరిలో రాజ్యసభలో సమర్థించుకుంటూ ఒక వివరణ ఇచ్చారు.
ఆయనే తర్వాత ఒక బ్లాగ్ పోస్ట్ లో కూడా దానిపై వ్యాఖ్యానిస్తూ, ఎలక్టొరల్ బాండ్స్ ద్వారా విరాళం ఇచ్చినవారు ఎంత మొత్తం ఇచ్చారు అనే విషయం ఆ ఇచ్చినవారికి మాత్రమే తెలుస్తుందని పేర్కొన్నారు.
2018 ఏప్రిల్ నెలలో, ది క్వింట్ అనే వార్తా సంస్థవారు రు.1,000 విలువ చేసే రెండు ఎలక్టొరల్ బాండ్స్ ను కొనుగోలు చేసి, అల్ట్రా వయొలెట్ లైట్ కింద పెడితే ఆ బాండ్ల మీద ఒక రహస్య ఆల్ఫా న్యూమరిక్ కోడ్ నంబర్ కనబడుతోందని బయటపెట్టింది. దానిపై కేంద్ర ఆర్థిక శాఖ ఒక పత్రికా ప్రకటన చేసింది.
“ఒక బాండ్ అమ్మకం జరిగిన తర్వాత దానిపై ఉండే రహస్య నంబర్ ను స్టేట్ బ్యాంక్ ఏ రికార్డులలోనూ నమోదు చేయటంలేదు” అని ప్రభుత్వం వివరణ ఇచ్చింది. కాబట్టి ఆ రహస్య నంబర్ ను తాము ఏ విధంగానూ ఉపయోగించటంలేదని, దాని ద్వారా ఆ బాండ్ కొనుగోలు తర్వాత జరిగే లావాదేవీల సమాచారాన్ని కనుగొనలేమని పేర్కొంది. ఈ ఎలక్టొరల్ బాండ్స్ ను అమ్మటానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిన ఏకైక బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్న విషయం తెలిసిందే.
అయితే, పారదర్శక కార్యకర్త కమాండర్ లోకేష్ బాత్రా(రిటైర్డ్) సంపాదించిన రహస్య పత్రాల ద్వారా తేలిందేమిటంటే, ప్రభుత్వం చెప్పుకొచ్చినదానికి పూర్తి విరుద్ధంగా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ రహస్య ఆల్ఫా న్యూమరిక్ కోడ్ నంబర్ ద్వారా బాండ్లను కొనుగోలుచేసినవారి వివరాలను, ఆ బాండ్లను విరాళంగా పొందిన పార్టీల వివరాలను ట్రాక్ చేస్తోంది అని.
ఈ బాండ్లను ఇలా ట్రాక్ చేయటానికి కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదంకూడా ఉన్నట్లు పత్రాలు తెలుపుతున్నాయి. ఎలక్టొరల్ బాండ్స్ కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని పోలీసులు, నేర పరిశోధక సంస్థలు అడిగినప్పుడు స్టేట్ బ్యాంక్ ఇవ్వాల్సిఉంటుందని ఈ పథకంలోని నిబంధనలలోనే పేర్కొని ఉంది.
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ), ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ వంటి ప్రభుత్వ సంస్థలు ప్రభుత్వాధినేతల రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నాయంటూ వాటిపై ఇటీవల పెద్ద ఎత్తున ఆరోపణలు వినబడుతున్న సంగతి తెలిసిందే.
కాబట్టి ఈ బాండ్స్ ను కొనుగోలు చేసి విరాళంగా ఇచ్చే దాతల వివరాలు ప్రభుత్వానికి తెలియకుండా ఉండలేవని ఈ రహస్య పత్రాలద్వారా స్పష్టమవుతోంది. ఈ విరాళాల గురించిన వివరాలు తెలియనిదల్లా దేశ ప్రజలకు, ప్రతిపక్ష పార్టీలకు మాత్రమే.
పార్లమెంట్ లో దీనిగురించి చర్చ సందర్భంగా మాత్రం అరుణ్ జైట్లీ మాట్లాడుతూ, ఈ పథకంలో లావాదేవీల సమాచారం రహస్యంగా ఉంచటం వలన విరాళాల విషయంలో అన్నిపార్టీలకూ లబ్ది చేకూరేటట్లు చేశామని చెప్పుకొచ్చారు.
“ప్రతిపక్ష పార్టీలకుకూడా లబ్ది చేకూరేటట్లుగా తాము చట్టాలను రూపొందించిందంటే, తమ ప్రభుత్వానిది ఎంత గొప్ప మనసో అర్థం చేసుకోవచ్చు” అని జైట్లీ చెప్పారు.
అయితే మంత్రి చెప్పిన ఆ మాటలలోని డొల్లతనం అంతా ‘ద లీడ్’ బయటపెట్టిన అధికారిక రికార్డులు, సభలలో చెప్పిన మాటల రికార్డులు, ప్రభుత్వ నోట్ ల ద్వారా బయటపడింది.
బట్టబయలు ‘రహస్యం’
2017 ఫిబ్రవరి 1న ఈ ఎలక్టొరల్ బాండ్స్ పథకాన్ని నాటి కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో మొదటిసారి ప్రకటించే సమయానికి, అసలు ఈ బాండ్లు ఎలా పనిచేస్తాయనే విషయంపై ప్రభుత్వానికికూడా అవగాహన లేదు.
రిజర్వ్ బ్యాంక్, ఎన్నికల సంఘం, ప్రతిపక్ష పార్టీలతో దీనిపై మొక్కుబడిగా చర్చలు జరిపిందిగానీ, వారు అందరూ ఇచ్చిన సలహాలనుమాత్రం ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టింది.
కేంద్ర ఆర్థిక శాఖ ఈ బాండ్స్ కోసం స్థూలంగా ఒక మౌలిక రూపాన్ని సృష్టించుకుని, అప్పుడు ఆ పథకాన్ని ఎలా నడపాలనేదానిపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో చర్చలు జరిపినట్లు 2018 జనవరినాటి కేంద్ర ప్రభుత్వ శాఖల మధ్య జరిగిన అంతర్గత ఉత్తర ప్రత్యుత్తరాలద్వారా తెలుస్తోంది.
ఎలక్టొరల్ బాండ్స్ ను కొనుగోలు చేసినవారు, వాటిని అందుకున్నవారి సమాచారం తెలుసుకోవటంకోసం ఆ బాండ్లకు సీరియల్ నంబర్లు అవసరమని 2018 జనవరి 16న కేంద్ర ఆర్థిక శాఖతో జరిగిన ఒక సమావేశంలో స్టేట్ బ్యాంక్ అధికారులు వివరించారు.
“ఎలక్టొరల్ బాండ్లపై కొనుగోలుదారు పేరుగానీ, విరాళంగా అందుకున్నవారి పేరుగానీ ఉండవు, కానీ ఒక సీరియల్ నంబర్ అయితే మాత్రం తప్పక ఉండాలి” అని బ్యాంక్ అధికారులు ఆర్థిక శాఖ అధికారులతో చెప్పినట్లు ఆర్థిక శాఖ అంతర్గత రికార్డులు చెబుతున్నాయి.
ఈ సీరియల్ నంబర్లు లేకపోతే తమకు అంతర్గత ఆడిట్ కు, సర్దుబాటుకు సమస్యలు వస్తాయని బ్యాంక్ వాదన. న్యాయస్థానాలుగానీ, పోలీస్, నేరపరిశోధన సంస్థలుగానీ ఈ బాండ్ల సమాచారం అడిగితే తమ వద్ద సమాధానం ఉండదని బ్యాంక్ అధికారులు తెలిపారు. ఒక ప్రత్యేకమైన గుర్తింపు నంబర్ లేకపోతే నకిలీ బాండ్లను సృష్టించే వీలు ఉంటుందని, మరోవైపు బాండ్లతో ఖాతాలు నిర్వహించటంకూడా కష్టమవుతుందని వెల్లడించారు.
అలా ఎలక్టొరల్ బాండ్స్ ఖాతాలను నిర్వహించటానికి వాటిమీద ముద్రించిన సీరియల్ నంబర్లతో, ఆ బాండ్లు ఎవరు కొన్నదీ, ఎవరికి విరాళంగా ఇచ్చినదీ, అందుకున్నవారు వాటిని ఎక్కడ డిపాజిట్ చేసినదీ మొత్తం సమాచారం స్టేట్ బ్యాంకువారివద్ద అందుబాటులో ఉంటుంది.
విరాళం ఇచ్చినవారి సమాచారం ప్రజలకు తెలియదుగానీ, స్టేట్ బ్యాంకుకు తెలుస్తుందన్నమాట. స్టేట్ బ్యాంక్ చేసిన ఈ వాదనతో కేంద్ర ఆర్థికశాఖ వారు ఏకీభవించారు.
“బ్యాంక్(స్టేట్ బ్యాంక్) వారికి బాండ్ల ఖాతాల నిర్వహణలో ఇబ్బంది లేకుండా ఉండేందుకుగానూ, వాటిపై సీరియల్ నంబర్ ముద్రించుకోవటానికి అనుమతించవచ్చు” అని కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు తమ అంతర్గత నోట్ లలో పేర్కొన్నారు. “అయితే ఆ సమాచారం బయటకు పొక్కకుండా దానిని అత్యంత రహస్యంగా బ్యాంక్ నిర్వహించాల్సి ఉంటుంది.”
కాబట్టి పోలీసులు, నేర పరిశోధక సంస్థలు అడిగితే స్టేట్ బ్యాంక్ వారు ఎలక్టొరల్ బాండ్స్ సమాచారాన్ని ఇవ్వాల్సిఉంటుందని స్పష్టమవుతోంది.
ఈ పథకానికి సంబంధించి 2018 జనవరి 2న విడుదల చేసిన నోటిఫికేషన్ లోని సెక్షన్ 6(4)లో, “ఏదైనా నేర పరిశోధనకోసం కోర్టో, ఇతర ప్రభుత్వ సంస్థో కోరితే మినహాయించి బాండ్స్ కొనుగోలు చేసేవారు అందించిన సమాచారాన్ని అధీకృత బ్యాంక్ అత్యంత రహస్యంగా పరిగణిస్తుంది, ఎలాంటి పనికోసమూ ఏ సంస్థకూ అందజేయదు” అని పేర్కొని ఉంది.
అయితే బాండ్స్ సమాచారం అవసరమయ్యే క్రిమినల్ కేసులు ఎలాంటివి అయిఉండాలనే విషయంపై స్పష్టత లేదు. దీనివలన స్టేట్ బ్యాంక్ నుంచి పోలీసులు, ఇతర దర్యాప్తు సంస్థలు ఎప్పుడు సమాచారాన్ని అడగవచ్చు అనే విషయంపై సందిగ్ధత నెలకొంది.
పంజరంలో చిలుకలు
ఎలక్టొరల్ బాండ్స్ లావాదేవీలకు సంబంధించి స్టేట్ బ్యాంక్ వద్ద ఉండే రికార్డులను అధికారంలో ఉండే ప్రభుత్వం చూడగలదా?
కాబట్టి బాండ్ల సమాచారం పూర్తిగా తెలుసుకోగలిగినది అని, ఆ సమాచారాన్ని పోలీసులు, దర్యాప్తు సంస్థలు అడిగితే ఇవ్వాలి అని తెలుస్తోంది. మరోవైపు సీబీఐ అనేది ప్రభుత్వం దగ్గర ఉండే “పంజరంలో చిలక” లాంటిదని సాక్షాత్తూ సుప్రీమ్ కోర్టే వ్యాఖ్యానించిన విషయంకూడా తెలిసిందే.
ఇంకా, ఈ ఎలక్టొరల్ బాండ్స్ పథకాన్ని నిర్వహించే స్టేట్ బ్యాంక్ తరచూ కేంద్ర ఆర్థిక శాఖ జారీ చేసిన నిబంధనలు, ఆదేశాలకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు రికార్డులు తెలుపుతున్నాయి. అయితే కేంద్ర ఆర్థికశాఖ ఆమోదం ఉంటేనే ఇలా చేస్తుండటం గమనార్హం.
చివరికి సమాచార హక్కు చట్టంకింద వచ్చే దరఖాస్తులకుకూడా కేంద్ర ఆర్థికశాఖ అనుమతి లేకుండా స్పందించటంలేదు.
2019 సాధారణ ఎన్నికలు జరగటానికి కొద్దిరోజులముందు 2019 ఫిబ్రవరిలో, ఎలక్టొరల్ బాండ్స్ ప్రత్యేక అమ్మకాలు ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం స్టేట్ బ్యాంకుకు సూచించింది. మొదట నిరాకరించినప్పటికీ తర్వాత అమ్మకాలను బ్యాంక్ ప్రారంభించింది.
వాస్తవానికి నిబంధనల ప్రకారం సంవత్సరానికి నాలుగు పర్యాయాలు పదిరోజుల చొప్పున ఈ బాండ్స్ ను అమ్మాల్సి ఉంటుంది, సాధారణ ఎన్నికలు జరిగే సంవత్సరంలోమాత్రం అదనంగా 30 రోజులపాటు ప్రత్యేక అమ్మకాలు చేయవచ్చు.
‘ద లీడ్’ సంపాదించిన ఉత్తర ప్రత్యుత్తరాలద్వారా తెలిసిందేమిటంటే, 2019 ఫిబ్రవరిలో జరిపిన 30 రోజుల ప్రత్యేక బాండ్ల అమ్మకాలను ఐదురోజులపాటు పొడిగించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. నిబంధనలకు విరుద్ధమైన ఈ పొడిగింపుకు నాటి కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అదే నెలలో అనుమతి ఇచ్చారని ఆర్థిక శాఖ అంతర్గత నోట్స్ ద్వారా తెలుస్తోంది.
2019 ఫిబ్రవరి 28న తమ ఆదేశాలను అనుసరించాలంటూ కేంద్ర ఆర్థికశాఖనుంచి స్టేట్ బ్యాంకుకు ఈ మెయిల్ అందింది.
ఆర్థికశాఖ ఆదేశాలు నిబంధనలకు విరుద్ధమని, దీనిపై స్పష్టత ఇవ్వాలని కోరుతూ స్టేట్ బ్యాంక్ అధికారులు అదే రోజున ఆ మెయిల్ కు జవాబు ఇచ్చారు.
నిబంధనలకు విరుద్ధంగా బాండ్స్ అమ్మకానికి పొడిగింపు ఇవ్వటానికి సంబంధించి నెపం అంతా స్టేట్ బ్యాంకుపై నెట్టేయటానికి కేంద్ర ఆర్థిక శాఖ ప్రయత్నించింది. నిబంధనల ప్రకారం జరపాల్సిన 30 రోజుల అమ్మకాలకు బదులుగా 35 రోజులు జరపటం “స్టేట్ బ్యాంక్ సిఫార్సులు”కు అనుగుణంగా జరిగిందని కేంద్ర ఆర్థిక శాఖ అదే రోజు ఇచ్చిన రిప్లై మెయిల్ లో పేర్కొనిఉంది.
ఆ వాదనను స్టేట్ బ్యాంక్ తిప్పికొట్టింది.
కేంద్ర ఆర్థిక శాఖకు ఇచ్చిన ఒక మెయిల్ లో, “ఎలక్టొరల్ బాండ్స్ అమ్మకాలను పొడిగించమని 27.02.2019న మీనుంచి మాకు టెలిఫోన్ ద్వారా ఆదేశాలు వచ్చాయి, 28.02.2019న మీరు ఇచ్చిన మెయిల్ లో పేర్కొన్నట్లు మేము సిఫార్సు చేయలేదు” అని స్టేట్ బ్యాంక్ కుండ బద్దలు కొట్టింది.
అయితే, నింద తమపైకి రానంతవరకు, నిబంధనలకు విరుద్ధంగా 35 రోజులపాటు బాండ్స్ ప్రత్యేక అమ్మకాలు జరపటానికి అంగీకరిస్తున్నట్లు బ్యాంక్ అదేరోజు ఇచ్చిన ఈ మెయిల్ లో పేర్కొంది.
అప్పటికి ఎలక్టొరల్ బాండ్స్ పథకం చట్టబద్ధత, దాని అమలును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై సుప్రీమ్ కోర్ట్ లో విచారణ ప్రారంభమయింది. దీనిపై 2019 ఏప్రిల్ 12న సుప్రీమ్ కోర్ట్ తాత్కాలిక ఆదేశాలు ఇచ్చింది. ఆ ఆదేశాలతో పాటు, బాండ్స్ కు సంబంధించి నిబంధనలను ఉల్లంఘించవద్దని, 2019 ప్రత్యేక అమ్మకాల కాలపరిమితిని 30 రోజులకు పరిమితం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ 30 రోజుల కాలపరిమితిని 35 రోజులకు పొడిగిస్తూ నిబంధనలను మార్చాలని కేంద్రం యోచించినప్పటికీ, కోర్ట్ ఆదేశాల నేపథ్యంలో వెనక్కు తగ్గింది.
(అనువాదం: శ్రవణ్ బాబు)
(ఈ కథనం మొట్ట మొదట హఫింగ్టన్ పోస్ట్ ఇండియా వెబ్ సైట్ లో ప్రచురితమయింది – Link)
Read Parts 1 to 5 here.